ముంబైలో బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సమావేశమయ్యారు. కొద్ది సేపు వారితో ముచ్చటించారు. ఉత్తర ప్రదేశ్‌ని చలన చిత్ర అనుకూల రాష్ట్రంగా తెలియజేస్తూ … సినీ నిర్మాణానికి ఉత్తర ప్రదేశ్‌ని గమ్యస్థానంగా మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ మేరకు సీఎం యోగి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపీలుగా చేశామని పేర్కొన్నారు. అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏం చేయాలో కూడా తమకు తెలుసు అని అన్నారు.అదిగాక సమాజాన్ని ఏకం చేయడానికి, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వాస్తవానికి ఉత్తర ప్రదేశ్ చలన చిత్ర అనుకూల రాష్ట్రంగా ఆవిర్భవించందని జాతీయ చలన చిత్ర అవార్డుల్లో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో గుర్తింపు లభించిందని చెప్పారు.అంతేకాకుండా తమ ప్రభుత్వ సినిమా పాలసీ ప్రకారం.. యూపీలో వెబ్ సిరీస్ చిత్రీకరిస్తే 50 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అలాగే స్టూడియోలు, ఫిల్మ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 25 శాతం సబ్సిడీ ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బోనీ కపూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ ఎంపీ, నటుడు రవికిషన్, భోజ్ పూరి నటుడు దినేష్ లాల్ నిర్హువా, నేపథ్య గాయకులు సోనునిగమ్, కైలాష్‌ఖేర్, నటుడు సునీల్ శెట్టి, నిర్మాతలు చంద్రప్రకాశ్ ద్వివేది, మధుర్ భండార్కర్, రాజ్ కుమార్ సంతోషి తదితరులు పాల్గొన్నారు.