బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అగ్రనేతలందరూ ఒకచోటకు చేరి.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ప్రజల్లో ఉందాం.. ఏ ఎన్నికైనా గెలుద్దాం.. అనే లక్ష్యంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ.
ఈ సమావేశాల కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నగరానికి వచ్చారు. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాతబస్తీకి వెళ్లారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో యోగితోపాటు బండి సంజయ్, లక్ష్మణ్ సహా పలువురు నేతలు ఉన్నారు. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
షెడ్యూల్ ప్రకారం శనివారమే అమ్మవారి దర్శనానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉంది. కానీ.. సమయం సర్దుబాటు కాకపోవటంతో వాయిదాపడింది.