– గర్భగుడి పనులకు శంకుస్థాపన
– హాజరైన సీఎం యోగి.. ప్రత్యేక పూజలు
అయోధ్యలో రామమందిరం.. కోట్ల మంది హిందువుల కల. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు మోడీ పాలనలో మందిరం సాకారమౌతోంది. నిర్మాణం వేగంగా సాగుతోంది. ఆ దివ్య భవ్య నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి హిందువులంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. శతాబ్దాల తరబడి చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా అపురూప రామ మందిరం ఇంకొన్నాళ్లలో మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. తాజాగా ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
రెండో దశ పనుల్లో భాగంగా రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అయోధ్య హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు యోగి.
తొలి దశ పనుల్లో మందిర నిర్మాణంలో భాగంగా ఫ్లాట్ ఫామ్ ను నిర్మించారు. ఇప్పుడు రెండో దశ పనుల్లో భాగంగా గర్భగుడి నిర్మిస్తున్నారు. రెండో దశ పనులను మూడు అంచెల్లో చేపడుతున్నారు. 2023 లోగా గర్భగుడి నిర్మాణం పూర్తి చేయాలని చూస్తున్నారు. అలాగే 2024 లోపు ఆలయం మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఇక ఆలయ నిర్మాణంలో భాగమైన కాంప్లెక్స్ ను 2025లోగా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేసింది ట్రస్ట్. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు కాగా.. వెడల్పు 235 అడుగులు. మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ ఆలయం ఎత్తు 161 అడుగులు.