యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ను పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హెలిక్యాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ వివరాల్లోకి వెళితే….
సీఎం ఆదిత్య నాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి వెళ్లారు. అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలిక్యాప్టర్ లో ఆయన బయలు దేరారు. ఆ సమయంలో హెలిక్యాప్టర్ ను ఓ పక్షి ఢీ కొట్టింది. దీంతో అలర్ట్ అయిన పైలట్ హెలిక్యాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్టు సందేశం పంపించాడు.
దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ మాట్లాడుతూ… సీఎం ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ విండోను పక్షి ఢీ కొట్టిందన్నారు. దీంతో హెలిక్యాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఆయన లక్నోకు వెళ్లారు అని వివరించారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కలెక్టర్ స్ఫష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసికి వెళ్లిన సీఎం అక్కడ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.