ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన ఘనత సాధించారు. 100 సార్లకు పైగా కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సీఎంగా రికార్డు సృష్టించారు. సీఎం యోగి 2017లో అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున ప్రతి 21 రోజులకోసారి కాశీ ఆలయానికి వచ్చి విశ్వనాథుడిని ఆరాధించడంతో పాటు రాష్ట్ర, దేశ ప్రజల సంక్షేమం కోసం ‘షాడశోపచార’ పద్దతిలో ప్రార్థిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం యోగి శుక్రవారం 113వ సారి వారణాసికి వచ్చారు. గతేడాది సెప్టెంబర్ లో వందోసారి వారణాసి పర్యటన చేపట్టారు. గత ఆరేళ్లలో 100 సార్లు కాల భైరవ ఆలయాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రిగానూ రికార్డు సృష్టించారు ఆదిత్యానాథ్.
కాలభైరవుడిని ‘కాశీ కొత్వాల్’ అని పిలుస్తారు. శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు చేసి ‘ఆరతి’ నిర్వహించారు. ఆ తర్వాత గుడి బయట డమ్రు వాయించే బాలుడితో కూడా సరదాగా కాసేపు మాట్లాడి అతని చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా సీఎం యోగి కొత్తగా నిర్మించిన సర్క్యూట్ హౌస్ భవనాన్ని పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వారణాసి చేరుకున్న సీఎం యోగి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు మార్గదర్శకాలు అందించారు. కార్ఖియాన్వ్ లోని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, 34వ కార్ప్స్ పీఏసీ, రోహనియా పోలీస్ స్టేషన్ లో నిర్మించిన బ్యారక్ లను కూడా సీఎం యోగి ఆదిత్యానాథ్ పరిశీలించారు.