యూపీలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై కేబినెట్ మంత్రుల్లో అంసతృప్తి జ్వాలలు రగులుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇద్దరు కేబినెట్ మంత్రులు యోగిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వారిలో ఒకరు తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. మరొకరు ఏకంగా బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం రేపుతోంది. దీంతో యోగీ కేబినెట్ లో లుకలుకలు బయటపడ్డాయి.
దేశవ్యాప్తంగా బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. పలు చోట్ల బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉన్నా ఎక్కడా నేతలు బయటపడలేదు.కానీ యూపీ లాంటి రాష్ట్రంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది.
అధికార కార్యక్రమాలకు తనను పిలవడం లేదని, మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేవని, తన పట్ల సీఎం నిర్లక్ష్యం చూపుతున్నారని కేబినెట్ మంత్రి దినేశ్ ఖాటిక్ తెలిపారు. తాను దళితున్ని కావడమే అందుకు కారణమని ఆయన ఆరోపిస్తున్నారు.
తనకు సీఎం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన పంపించారు.
మరోవైపు సీఎం యోగీపై ప్రజా పనుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో మంత్రి జితిన్ ప్రసాద పీఏ కూడా ఉన్నారు.
ఈ వ్యవహారంలో జితిన్ ప్రసాదను సీఎం యోగీ తీవ్రంగా మందలించారని అందుకే యోగీపై జితిన్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం యోగీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు జితిన్ ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.