వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు చలికాలంలో కూడా వేడిని పుట్టిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టి యూపీపైనే ఉంది. 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్.. 2024 లోస్ సభ ఎన్నికలకు రూట్ క్లియర్ చేస్తుంది. దీంతో దేశ రాజకీయాలన్ని యూపీ పై కేంద్రీకృతం అయ్యాయి. ఇటీవల యోగీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. దీనిపై చాలా మంది చాలా విశ్లేషణలు చేశారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ యోగీ తను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు. గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా యోగీ ఆధిత్యానాథ్ మొదటి సారి పోటీ చేస్తున్నారు. గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నా అని చెప్పారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 107 అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో యోగీ పేరు కూడా ఉంది. ఆయన గోరఖ్ పూర్ లో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సిరాతు స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య, మథుర, గోరఖ్‌పూర్‌ల నుంచి ఒకచోట నుంచి బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయోధ్య పేరు బలంగా వినిపించింది. అయితే.. చివరికి గోరఖ్ పూర్ ఖాయం చేశారు.
మొత్తం 107 అభ్యర్థుల్లో మొదటి విడత ఎన్నికల జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకు 38 మందిని ఫైనల్ చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో 20మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. 107 స్థానాల్లో 83 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి 63మందికే మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో ఈ 20 మంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పార్టీలు జంప్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే ముగ్గురు మంత్రుల సహా మొత్తం 10 మంది కమలం ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పి ఎస్పీలో చేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 312 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.