కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా.. రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు మార్చి 2022 వరకు ఉచిత రేషన్ పొందుతారు. అయితే, రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ఈ పథకాన్ని మరో మూడు నెలలు పొడగిస్తూ నిర్ణయం తీసుకునున్నారు. దీంతో యూపీ ప్రజలు మరో మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ పొందనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి.. రెండోసారి యోగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం లక్నోలోని లోక్‌భవన్‌లో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో యోగి ప్రభుత్వం మరో మూడు నెలలు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కొత్తగా ఎంపికైన డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పేద ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 15 కోట్ల మందికి లబ్ధి పొందనున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఈ ఉచిత రేషన్ పథకం గడువు మార్చితో ముగియాల్సి ఉండగా.. దానిని మరో 3 నెలలు పొడిగించారు.
యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు, నితీష్ కుమార్ తదితరుల సమక్షంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.