రక్తం గడ్డ కట్టే చలిలో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తూ… ఫుట్‌పాత్‌లపై ప్రాణాలు విడిచే వారు ఎందరో. ప్రతి యేటా ఇదే తంతు… అయినా ప్రభుత్వాలు కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయవు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించవు. అలా మనషుల ప్రాణాలకే విలువలేవు. కానీ ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ చేస్తున్న పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత చాలా ఎక్కువ. అక్కడ వందలాది మంది పేదలు, అనాధలు చలికి ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. వారిని పట్టించుకోని ప్రభుత్వం… చలి నుండి ఆవులను కాపాడేందుకు మాత్రం ముందుకు వచ్చింది. ఆవులకు చలి కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆవులను చలి నుండి కాపాడేందుకు స్పెషల్ డ్రైవ్ చేయబోతుంది ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సర్కార్. పైగా ఈ కార్యక్రమాన్ని అయోధ్య నుండే మొదలుపెట్టాలని సీఎం సూచించారట. నాలుగైదు దశల్లో ఈ కార్యక్రమం పూర్తిచేస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించటం విశేషం.
దీంతో… ఆవులకు మహార్ధశ పట్టిందని, మనుషులకన్నా ప్రభుత్వాలకు ఆవులు, కుక్కలపైనే ఎక్కువ మక్కువ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఒకరేమో మనుషులు ఏమైనా పర్వాలేదని ఆవులకు చలికోట్లు ఇస్తుంటే… మరోకరేమో రాష్ట్రంలో కార్మికుల చావులను పట్టించుకోకుండా… తన పెంపుడు కుక్క చావుకు కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నారు.