యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తనకు మొత్తం ఒక కోటి 54 లక్షల 94 వేల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అలాగే.. రూ.12 వేల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, రూ. లక్ష విలువ ఉండే రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
రూ.49 వేల విలువ ఉండే బంగారు చెవి రింగు, రూ.20 వేల రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి వెల్లడించారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనకు సొంత వాహనం కూడా లేదని చెప్పారు యోగీ.
అలాగే.. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని అన్నారు. తనపై పెండింగ్ లో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. గతంలో లోక్ సభ సభ్యుడిగా ఆయన ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గోరఖ్ పుర్ శాసనసభ స్థానం నుంచి ఆయన నామినేషన్ వేశారు.
ఇదిలా ఉండగా.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తనకు 17.22 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారాలు జోరందుకున్నాయి.