క్రిమినల్స్ గా తేలినవారి ఆస్తులు, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..’బుల్డోజర్ బాబా’గా పాపులర్ అయితే అయ్యారు కానీ అసలైన ‘బుల్డోజర్ బాబా’ మాత్రం రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంటున్నారు. 2019 నుంచే గెహ్లాట్ ప్రభుత్వం నేరస్థుల ఆస్తులు, ఇళ్ళు, కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తోందట. అక్రమ ఆస్తులను కూల్చివేసే అధికారాన్ని ఈ ప్రభుత్వం జైపూర్ డెవలప్మెంట్ అథారిటీకి ఆనాడే కట్టబెట్టింది.
2019 నుంచి ఇప్పటివరకు తాము 76 అక్రమ బిల్డింగులను కూల్చివేసినట్టు ఈ సంస్థ తన డేటాలో తెలిపింది. పింక్ సిటీలో గానీ, మరెక్కడైనా గానీ ఇలాంటి కట్టడాలు ఉన్నట్టు తెలిస్తే ఈ అథారిటీ అధికారులు అక్కడ వాలిపోయి బుల్డోజర్ల ‘ఆయుధాలను’ ప్రయోగిస్తారు. గతవారం జైపూర్ లో వీరు ఓ కోచింగ్ సెంటర్ తో సహా మరో భవనాన్ని ‘మట్టుబెట్టారని’ ఈ డేటా పేర్కొంది.
గత ఏడాది డిసెంబరులో టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులని భావిస్తున్న సురేష్ ధాకా, భూపేంద్ర శరన్ అనే ఇద్దరికి చెందిన ఈ కోచింగ్ సెంటర్ ను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఆ సందర్భంలో యూపీ సీఎం యోగి ప్రభుత్వం పాటిస్తున్న ‘బుల్డోజర్ పాలసీ’ని పలు వార్తా సంస్థలు గుర్తుకు తెస్తూ.. ఆ పాలసీతో దీన్ని పోల్చాయి. ప్రభుత్వానికి చెందిన భూముల్లో అక్రమంగా వెలసిన ప్రైవేటు వ్యక్తుల భవనాలు లేదా కమర్షియల్ బిల్డింగులను, క్రిమినల్ ఆరోపణలకు గురైనవారి ఆస్తులను 2019 నుంచే గెహ్లాట్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తూ వచ్చిందని తెలుస్తోంది. 2018 డిసెంబరు లో ఈ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి .. ప్రభుత్వ భూములను ఇలా కాపాడుకుంటూ వస్తోంది.
2019 లో 18 పెద్ద బిల్డింగులను, 2020 లో 20 భవనాలను, 2021 లో 16 ఆస్తులను, 2022 లో 22 బిల్డింగులను జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేసింది. ఈ ఒక్క నెలలోనే రెండు బిల్డింగులు నేలమట్టమయ్యాయి. అయితే యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా మైనారిటీకి చెందినవారి ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్టున్నట్టు ఆరోపణలున్నాయని, కానీ రాజస్తాన్ లో అలాంటి పాలసీ కాకుండా ఏ వర్గానికి చెందిన వారి అక్రమ ఆస్తులనైనా నేలమట్టం చేస్తున్నామని ఓ అధికారి చెప్పారు.