సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ విమర్శలు మూటగట్టుకుంటోంది. టీమిండియా జట్టు గత కొద్ది రోజులుగా రెస్ట్ లేకుండా మ్యాచ్ లు ఆడుతోంది. అక్టోబర్- నవంబర్ లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వరకూ జట్టుకు రెస్ట్ లేకుండా షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లకు సీనియర్లలో కొంతమందికి బీసీసీఐ రెస్ట్ ఇవ్వడం… లేదా వాళ్లే తమకు విశ్రాంతి కావాలని కోరుతూ ఉండటం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని మాజీ క్రికెటర్ల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం బీసీసీఐ, ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు రెస్ట్ కోరడాన్ని అస్సలు సమర్థించనన్నారు. ఆటగాళ్లంతా ఐపీఎల్ లీగ్ అప్పుడు విశ్రాంతి కోరరు.. కానీ, టీమిండియా మ్యాచ్ లు అనగానే రెస్ట్ కావాలంటారు. వారు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు విశ్రాంతి గురించి మాట్లాడొద్దంటూ గవాస్కర్ ఫైరయ్యారు.
ముఖ్యంగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంపై గవాస్కర్ స్పందించారు. ఈ విషయంలో బీసీసీఐ ఒక సక్రమమైన పద్ధతిని పాటించాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న గ్రేడ్ – ఏ క్రికెట్లర్లందరికీ బోర్డు నుంచి మంచి కాంట్రాక్టులు ఉన్నాయి. అదీగాక ప్రతి మ్యాచ్ కు వాళ్లు పేమెంట్లు అందుకుంటున్నారు. ఏదైనా కంపెనీలో సీఈవో గానీ ఎండీగానీ భారీగా వేతనాలు అందుకుని పదే పదే రెస్ట్ తీసుకుంటాడా అంటూ ప్రశ్నించారు గవాస్కర్.
భారత క్రికెట్ మరింత ప్రొఫెషనల్ గా మారాలంటే రెస్ట్ పాలసీపై బీసీసీఐ తప్పకుండా ఒక సరైన విధానాన్ని అనుసరించాలని,.. విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆటగాళ్లు కాంట్రాక్టులలో కూడా కోత విధించుకోవాలని,… అప్పుడు క్రికెటర్లు కావాల్సినంత విరామం తీసుకోవచ్చంటూ సునీల్ గవాస్కర్ సూచించారు.