ఆంధ్రప్రదేశ్ కేడర్ కు సోమేశ్ కుమార్ బదిలీ అయిన నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు ఆయనకు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమకు పట్టిన గతే మీకు పట్టిందని..తమ గోసే మీకు వచ్చిందని.. ఆ లేఖలో టీచర్ సోమేశ్ కుమార్ పై సెటైర్లు వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తానిపర్తి తిరుపతి రావ్ అనే ఉపాధ్యాయుడు ఈ లేఖను రాయడం జరిగింది. అందులో ఆయన సోమేశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. మీకు కర్మ సిద్దాంతం అంటే ఏంటో తెలుసా.. అంటూ ఎద్దేవా చేశారు. అప్పట్లో కోర్టు తమకు ఏ తీర్పు ఇచ్చిందో ఇప్పుడు మీకు కూడా అదే తీర్పు ఇచ్చిందంటూ విమర్శించారు తిరుపతి రావ్. మీరు తమను బలవంతంగా ఏ విధంగా బదలీ చేశారో కోర్టు మిమ్మల్ని కూడా అలాగే బదిలీ చేసిందని.. దీనినే కర్మ సిద్ధాంతం అంటారని లేఖలో ఆయన పేర్కొన్నారు.
మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దని..అలా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని సెటైర్ వేశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తెలంగాణలో కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 317 పై అప్పట్లో చాలానే దుమారం రేగింది. ఈ జీవోను రద్దు చేయాలంటూ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు.
ఇటీవల ప్రగతి భవన్ ను కూడా ముట్టడించారు.317 జీవో వల్ల కుటుంబాలను వదిలి జిల్లా కాని జిల్లాకు వెళ్లి ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వారు రోడ్డెక్కారు..కోర్టుకెళ్లారు అయినా ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుపతి రావ్ సోమేశ్ కుమార్ కు ఇలా లేఖ రాయడం జరిగింది.