టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడిని వాల్డ్ లోనే బెస్ట్ కారుగా అభివర్ణించాడు. అలాంటి వాడిని ‘గ్యారేజీ’ లోనే ఉంచేశారని విచారం వ్యక్తం చేశాడు. మాలిక్ కి ప్రపంచ కప్ జట్టులో ఉండే అర్హత ఉందన్నాడు. టీ 20 వాల్డ్ కప్ కి అంతా సిధ్ధమవుతున్న వేళ.. ఇప్పటికే టీమిండియా బౌలింగ్ బలహీనతతో సతమతమవుతోంది. స్టార్ బౌలర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. రవీంద్ర జడేజా, జస్పీత్ బుమ్రా దీపక్ చాహర్ వంటివారు టీ 20 కి దూరమయ్యారు. రిజర్వ్ లో మహ్మద్ షమీని తీసుకోవచ్చు.
ఉమ్రాన్ ని ఇప్పటికీ ‘రా’ గానే పరిగణిస్తోంది టీమిండియా.. గత జూన్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ పేసర్ ఇండియా తరఫున ఆడాడు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అయ్యాడు. వాల్డ్ కప్ కి ఎంటరయ్యే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే విషయానికే వస్తే తన ఓటు ఉమ్రాన్ మాలిక్ కే అంటున్నాడు బ్రెట్ లీ. 22 ఏళ్ళ మాలిక్ భారత వాల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందేఅంటున్నాడు .
మాలిక్ బౌలింగ్ స్పీడ్ అమోఘం.. గంటకు 150 కి. మీ. వేగంతో బౌలింగ్ చేస్తాడు.. అంటే ప్రపంచం లోనే బెస్ట్ కారు మీ వద్ద ఉన్నప్పుడు మీరు దాన్ని గ్యారేజీ లోనే వదిలేస్తున్నారు.. అలాంటప్పుడు ఆ కారు మీ దగ్గర ఉండికూడా ప్రయోజనమేమిటి అని ప్రశ్నించాడు. వాల్డ్ కప్ కి మాలిక్ ని ఎంపిక చేయాల్సిందే అని వ్యాఖ్యానించాడు.
ఇలాంటి కారును గ్యారేజీలో ఉంచరాదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పిచ్ పై మాలిక్ బాగా రాణిస్తాడు అని చెప్పాడు. 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసీ బౌలర్ తో పోలిస్తే 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే మొనగాడే బెటర్ కదా అని బ్రెట్ లీ అన్నాడు.
భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ లకు తోడుగా మరో పేసర్ అవసరమని లీ అభిప్రాయపడ్డాడు. అయితే మాలిక్ వీసా చిక్కులను ఎదుర్కొంటున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియాలో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.