అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తొక్కిసలాట, పోలీసుల బాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జ్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ యువకుడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ కు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ గళమెత్తారు యువకులు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఒకరు చనిపోయారు.
మరోవైపు అగ్నిపథ్ పథకంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర సర్కార్ అప్పుడేమో రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు సైనికులను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్- నో పెన్షన్ వరకు తీసుకొచ్చారని కేటీఆర్ దుయ్యబట్టారు.