రికార్డుల్లో ఏముందో చూడటం లేని అధికారుల కంటి పరీక్షలకు… తెలుగు దస్త్రాలు చదవటం రాని అధికారుల విద్యాబోధనకు… చేయి తడిస్తే కాని పని చేయటం లేని లంచావతారులను ఆదుకునేందుకు భిక్షాటన చేస్తున్నాడో యువకుడు. తనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండంటూ ఏళ్ల తరబడి తిరుగుతున్న పట్టించుకోవటం లేదని మంచిర్యాల జిల్లా యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు.
మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ అనే యువరైతు తన భూమి కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తన భూమి తనకు దక్కాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. తాండూర్ శివారులోని 612/అ/5, 612/5/అ సర్వే నెంబర్లలో 8 ఎకరాల భూమి కొనుగోలుచేసి పదేళ్ళుగా సాగు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయన్నారు. కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారని వాపోయారు. తన భూమికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఎంతమంది కలెక్టర్లు వచ్చినా పరిస్థితిలో మార్పు రావటం లేదని… అవినీతికి పట్టాభిషేకం చేయాలా అంటూ నిరసనలు చేపట్టాడు. ముగ్గురు కలెక్టర్లు మారారని… ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులకు లంచం కొరకు భిక్షాటన చేస్తున్నానని చెప్పారు.
ఈ భూవి వివాదంలో ఉందని, తాము ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు స్థానిక తహశీల్దార్ కవితను వివరణ ఇస్తున్నారు. వివాదంలో ఉన్న భూములు ధరణి వెబ్‌సైట్‌లో కేటగిరి పార్టు బిలో ఉండడంతో సమస్యను పరిష్కరించలేక పోతున్నామని చెప్పారు.