ప్రేమించి మోసపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువకుడి మాయ మాటలకు నమ్మి బలి పశువైంది. నువ్వు లేకుండా ఉండలేనంటూ మోసం చేసి, వెంట తిరిగి చివరికి ఫ్లేటు ఫిరాయించాడు ఆ దుర్మార్గుడు. ప్రేమకు ఓకే కానీ.. పెళ్లికి మాత్రం నో చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… మంచిర్యాల బెల్లంపల్లిలోని సంషీర్ నగర్ కు చెందిన సోయం తేజశ్రీ అనే యువతి సూసైడ్ చేసుకుంది. అదే గ్రామం నెన్నల్ మండలం లంబాడీ తండాకు చెందిన దరావత్ రాజ్ కుమార్ అనే యువకుడు ప్రేమించి మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసింది బాధితురాలు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ కుమార్ మోసం చేశాడని వీడియోలో తెలిపింది. ముందు తనని ప్రేమించమంటూ వెంటపడ్డాడని.. తీరా ఒప్పుకుని కొన్ని రోజులు గడిచాక పెళ్లి చేసుకుందాం అంటే.. ఒప్పుకోలేదంటూ వీడియోలో పేర్కొంది తేజశ్రీ. పురుగుల మందు తాగుతూ సెల్పీ వీడియా తీసింది.
మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. తన బిడ్డ చావుకు కారణమైన రాజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.