కరోనా ప్రభావంతో యువ హీరో నితిన్ పెళ్లిపై నీలినీడలు కమ్ముకున్నాయి. యధాతథంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే పెళ్లి జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనే విషయంలో సస్పన్స్ కొనసాగుతోంది. మరో హీరో నిఖిల్ మాత్రం తన పెళ్లిని వాయిదా వేసే ప్రసక్తే లేదని… అవసరమైతే గుళ్లోకి వెళ్లైనా పెళ్లి చేసేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. ఇక నితిన్ పెళ్లిపై ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 15న పెళ్లి, మరుసటి రోజున రిసెప్షన్ చేసుకునేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ వివాహ వేడుకను ఘనంగా జరుపుకునేందుకు దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌ను ముందే బుక్ చేసుకున్నారు. నితిన్ పెళ్లి వేడుకకు 100మంది గెస్ట్ లను ఆహ్వానించారు. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దుబాయ్‌తో సహా అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరమే అనుమతి ఇస్తున్నారు.
ఇక, దుబాయ్ లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో పెళ్లిని వాయిదా వేసే ఆలోచనలో నితిన్ కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి వాయిదాపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి స్పందిస్తూ.. నితిన్ పెళ్లి వేదికను మార్చే ఆలోచనలో ఉన్నామని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దుబాయ్ లో పెళ్లి నిర్వహించడం కష్టతరమైన పని అని అన్నారు. పెళ్లిని వాయిదా వేయాలా..?వేదికను మరో చోటకు మార్చాలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే పెళ్ళికి మరింత సమయం ఉండటంతో అప్పటి వరకు పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.