చాలామంది హీరోలు ఓ రకమైన కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఏ కథ చేస్తే ఎలాంటి ఇమేజ్ వస్తుంది, అసలు మనసుకు నచ్చిన కథలు చేయొచ్చా అనే డౌట్స్ చాలామంది హీరోలకు ఉంటాయి. చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే కథలపై క్లారిటీ ఉంటుంది. తమ ఇమేజ్ కు సెట్ అయ్యే కథలేంటనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి కన్ప్యూజన్ లోనే ఉన్నాడు హీరో శివ కందుకూరి.
“సినిమా చేయాలంటే కథ, చేసే పాత్రలో పర్పస్ వుండేలా చూస్తాను. అలాగే కథలను ఎంపిక చేసుకుంటున్నాను. `గమనం` అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఆదరించారు. దాన్ని బట్టి నేను ఎంచుకున్న విధానం కరెక్ట్ అనిపించింది. నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బయటకు వచ్చి అర్థవంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను. కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను.”
ఇలా కథల ఎంపికలో తన మైండ్ సెట్ ను బయటపెట్టాడు శివ కందుకూరి. రాజ్ కందుకూరి కొడుకుగా, తను నెపో కిడ్ అయినప్పటికీ.. ఇమేజ్ కోసం ప్రయత్నించనంటున్నాడు. ఓ పాత్ర చేసినా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేస్తానని, ఇమేజ్ పట్టించుకోనని చెబుతున్నాడు.
“నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ పుష్పలోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి ‘పుష్ప’ మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది. ఏదో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందని ఏది పడితే అది చేయకూడదు. ప్రేక్షకులు మనల్ని నిశితంగా గమనిస్తూనే వుంటారు.”
ప్రస్తుతం మనుచరిత్ర అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. దీంతో పాటు ఓ క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఒకెత్తయితే, నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ అనే సినిమా మరో ఎత్తు అంటున్నాడు శివ. అది తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుందని చెబుతున్నాడు.