దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అత్యాచారాలను కట్టడి చేసేందుకు ఎన్ని చట్టాలను తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. దేశంలో కామాంధులు నిత్యం పశువాంఛతో ఏదో ఓ చోట దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్ల మండలం పరిధిలోని రాంపురం పంచాయతీ కొత్త తండాలో ఓ యువకుడు మూడేండ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితున్ని స్తంబానికి కట్టేసి దేహశుద్ది చేశారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం…. మూడేండ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఉయాలలో పడుకోబెట్టి వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. కొద్ది సమయం తర్వాత అదే గ్రామానికి చెందిన అశోక్(25) అటుగా వచ్చాడు. ఉయ్యాలలో పాప నిద్రిస్తున్న సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు.
దాన్ని గమనించిన స్థానికులు యువకున్ని పట్టుకున్నారు. అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.