హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో ఆ యువకుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫలక్‌నుమా పరిధిలోని చష్మా ప్రాంతానికి చెందిన జమాల్ అనే యువకుడు తీగలకుంటలో ఓ టైలర్ వద్ద పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఆ టైలర్ కుమార్తెను ప్రేమించాడు. ఆమెను ఇచ్చి వివాహం చేయాలని టైలర్ ను కోరాడు. అందుకు ఎంత మాత్రం ఒప్పుకోని బాలిక తండ్రి.. జమాల్‌ను మందలించాడు.
డీజిల్ క్యాన్ తో టైలర్ ఇంటికి వచ్చిన జమాల్.. కూతురునిచ్చి పెళ్లి చేయకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. భయంతో టైలర్ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. దీంతో క్షణం కూడా ఆలోచించకుండా ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు జమాల్. గమనించిన స్థానికులు జమాల్ కు అంటుకున్న మంటలు ఆర్పేశారు.
అయితే.. అప్పటికే తీవ్ర గాయాలైన జమాల్ ను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇదిలా ఉంటే.. జమాల్ ను హత్య చేశారని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.