చిన్నతనం నుంచి అమ్మంటే ప్రాణం అతనికి. అందుకే.. ఆమె లేని ఈ లోకంలో బతకటం వ్యర్ధం అనుకున్నాడు. తన తల్లి చనిపోయిన నెల రోజులకు తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్న కోడూరుకు చెందిన నిమ్మల రాజు, సునీత భార్యాభర్తలు. కౌలు రైతులైన వీరు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. వీరికి విఘ్నేశ్, వివేక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఒడిబియ్యం విషయంలో భర్తతో గొడవపడిన సునీత మనస్తాపంతో గతనెల 5న ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8న చనిపోయింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడైన విఘ్నేశ్ తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో అదే రోజు ఇంటి నుంచి బయలుదేరి సిద్దిపేటకు చేరుకున్నాడు. స్థానిక నర్సాపూర్ చౌరాస్తా సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని తండ్రి, బంధువులకు వీడియో కాల్ చేసాడు.
అమ్మ చనిపోవడం బాధగా ఉందని, ఈ లోకంలో ఉండనంటూ పురుగుల మందు తాగాడు. బాధిత కుటుంబీకులు వెంటనే చిన్నకోడూరు ఎస్ఐ శివానందంను ఆశ్రయించగా.. లొకేషన్ ను గుర్తించి టూ టౌన్ పోలీసులను అప్రమత్తం చేసారు. సిద్దిపేట పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని అపస్మారక స్థితిలో పడిపోయిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు తరలించారు. అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు విఘ్నేశ్.
చనిపోయే ముందు ఇన్ స్టాగ్రామ్ స్టేటస్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో తన తల్లితో కలిసి దిగిన ఫోటో, సందేశాన్ని జత చేశాడు. ‘స్వర్గంలో ఉంటున్న అమ్మా.. నీ వద్దకు రావాలని కోరుకుంటున్నా. నిన్ను చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. రెండు చేతులు చాచి ఒడిలోకి తీసుకో’ అంటూ పోస్ట్ చేశాడు విఘ్నేశ్.