పోలీసులు మందలించారని కరెంట్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మెదక్ జిల్లాలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరం పేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం అనే వ్యక్తి మద్యం సేవించి లింగాపూర్ గ్రామం వైపుగా బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలోనే పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సాయిరాంను పోలీసులు ఆపారు. ఈ క్రమంలో యువకుడికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి గురైన పోలీసులు అందరి ముందే సాయిరాంను కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన అతను సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఎక్కి తీగలను పట్టుకున్నాడు. అంతే కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అతన్ని పోలీసులు తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే సాయిరాం చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇతను గత వారం రోజుల క్రితం కూడా చిన్నశంకరం పేట పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇదే విధంగా ప్రవర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. ఈ ఘటన జరిగిన మూడు, నాలుగు గంటల తర్వాత సాయిరాం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువకుడి మృతదేహాన్ని వెంటనే చూసే అవకాశం కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు. కొద్ది గంటల తర్వాత సాయిరాం డెడ్ బాడీని చూపించి.. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వారితో ఎవరూ మాట్లాడకుండా.. ఎవరినీ కలవనీయకుండా కానిస్టేబుల్ ను కాపలా ఉంచారు పోలీసులు.