పోలీసుల వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘనపురం మండల కేంద్రంలోని షోరూమ్ లో 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్ఓసి కి సంబందించి.. ఘనపురం గ్రామానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది
అంతటితో ఆగకుండా ప్రశాంత్ మరికొందరు యువకులతో కలిసి మరోసారి షోరూం వద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. దీంతో షోరూమ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘర్షణకు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే.. విచారణలో భాగంగా స్థానిక ఎస్సై ఉదయ్‌కిరణ్ ప్రశాంత్ ను మందలించారు. దీంతో తనను ఎస్సై కొట్టారని మస్థానికి గురైన ప్రశాంత్.. ఏప్రిల్ 12న రాత్రి బండారుపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పదిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రశాంత్.. శనివారం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఎస్సై కొట్టడంతోనే తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ మృతికి కారణమైన పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.