ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత విడదీశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ గ్రామంలో నివసించే వరప్రసాద్, పూజలు ఇద్దరూ డిగ్రీ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే మాటపై ఉంటూ.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలని భావించుకున్నారు.
అయితే వారి ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోరని భయపడి.. పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత నెల 24వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వర ప్రసాద్ తమ కుటుంబానికి యువతి కుటుంబం నుంచి వేధింపులు వస్తాయని.. అలాగే తమకు రక్షణ కావాలని.. వివాహం అయిన వెంటనే స్థానికంగా ఉన్న బీబీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
అక్కడ వర ప్రసాద్, పూజలను ఎస్ఐ సాయి కుమార్ సముదాయించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎస్ఐను ప్రలోభ పెట్టి.. యువకుడికి వ్యతిరేకంగా మాట్లాడించారని.. యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం వరప్రసాద్, పూజలకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపించేశారు పోలీసులు.
అయితే తమను అన్యాయంగా విడదీశారన్న బాధను దిగమింగలేక.. మనస్తాపంతో వరప్రసాద్ అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతున్న వరప్రసాద్ శనివారం తుదిశ్వాస విడిచాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.