తప్పుడు కేసులు పెడుతూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన సాయి గణేష్.. బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు.
పార్టీలో చురుగ్గా పని చేస్తున్నాడని.. ఎలాగైనా అతని స్పీడ్ ను ఆపాలని కుట్ర పన్నిన కొందరు టీఆర్ఎస్ నేతల అండతో పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. బాధితుడు పట్టణంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అతని పరిస్థితి విషమించడంతో.. హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతిచెందాడు. అయితే.. అధికార పార్టీ నేత ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టారని ఆరోపణలు వినిసిస్తున్నాయి. సాయి గణేష్‌పై పోలీసులు 16 కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది.
సాయి గణేష్ మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు బీజేపీ నేతలు. స్థానిక మంత్రి ఒత్తిడితోనే.. గణేష్ పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.