లోన్ యాప్ వేధింపులకు తాజాగా మరో యువకుడు బలి అయ్యాడు. వ్యక్తిగత అవసరాలకు ఆన్ లైన్ లోన్ యాప్స్ లో అప్పు తీసుకున్నాడు. ఇంకేముంది డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆదుకోవడానికి కూడా ఎవరూ లేక దిక్కుతోచని స్థితిలో యవకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ.. తన అలవాట్లే శాపంగా మారాయంటూ ఓ లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరులోని పెనుమూరు మండలంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జానకీరాం అనే యువకుడు లోన్ యాప్ లో రూ.80 వేలు తీసుకున్నాడు. కొంత కాలం బాగానే చెల్లించినా.. ఆ తర్వాత చెల్లింపులు చేయడం జానకీరాంకి ఇబ్బందిగా మారింది. అయితో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఇందుకు జానకీరాం సూసైడ్ నోట్ కూడా రాశారు.
అవసరాలకు రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాను. తిరిగి కట్టలేక పోయాను. వాళ్లు మాత్రం నన్ను వేధిస్తున్నారు. ఆ బాధను భరించలేకపోతున్నా.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ప్రియమైన అమ్మ, నాన్న, వదినలు నన్ను క్షమించండి. అలవాట్ల కోసం, నా అవసరాల కోసం ఎన్నో తప్పులు చేశాను. నా లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డాను. నా అనుకున్న వాళ్లు నాకు ఎంతో అన్యాయం చేశారన్నారు. ఆన్ లైన్ లో అప్పు చేశాను. అది కూడా నా సొంత ఖర్చుల కోసమే.. కానీ నన్ను వాళ్లు వేధిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
రూ.80వేల ఆన్ లైన్ అప్పును మేనేజ్ చేయడం నా వల్ల కావడం లేదు. అందరి దగ్గర మాటలు పోయాయి. నన్ను క్షమించండి. కేవలం ఈ అప్పు కోసమే చనిపోతున్నాను. ఇంకా ఎవరి కోసమో కాదు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు అంటూ లెటర్ లో రాసుకొచ్చాడు జానకీరాం. యువకుడి మరణంతో అంబేద్కర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.