జనగామ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరగొని సత్యనారాయణ, పద్మల చిన్న కుమారుడు నజీర్ (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడు.
మృతుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ నజీర్ గత కొంత కాలంగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్ లు కాస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఇదే అలవాటుగా మారి అదే పనిగా ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టి పొగొట్టుకున్నాడు.
పెద్ద మొత్తంలో అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు.
దాని ఆధారంగా మృతుడు ఆన్లైన్ గేమ్ కు బానిసై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రఘునాథపల్లి పోలీసులు తెలిపారు.