వివాహం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండాలని అందరూ అనుకుంటూంటారు. అయితే ఈ వివాహబంధంలో మూడు మనసులు ఒక్కటయ్యాయి. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఒక్క వరుడికి.. ఇద్దరు వధువులతో పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డీటైల్స్ కి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో గిరిజన సంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. గిరిజన కులాల్లోని యువతి, యువకులు ఒకరిని ఒకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేస్తారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సహజీవనం చేస్తున్న క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. అయితే సహజీవనం చేసినందుకు పెద్దలకు, గ్రామస్థులకు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మి రెండవ కుమార్డు సత్తిబాబు.. డిగ్రీ వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. సత్తిబాబు ఇంటర్ చదువుతున్న క్రమంలో పక్క గ్రామానికి చెందిన స్వప్న కుమారి అనే యువతిని ప్రేమించాడు. అదే క్రమంలో వరుసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వప్నకి పాప జన్మించగా.. సునీతకు కూడా బాబు పుట్టాడు. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును కోరారు.
దీంతో సత్తిబాబు ఇద్దరినీ ప్రేమిస్తున్నానని.. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాని చెప్పాడు. దీంతో షాక్ అయిన గ్రామస్థులు.. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి.. వాళ్ల ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరితో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.