గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆ యువతి కనిపించకుండా పోవడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ కాసేపటికే ఆ సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వీడియోలో ఆమె చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
తన చావుకు ఏడుగురు కారణమంటూ వీడియోలో వారి పేర్లను చెప్పింది ఆ యువతి. వారంతా తనను వేధించారని.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించారని కంటనీరు పెట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
‘‘గుంటూరు రూరల్ ఎస్పీ గారికి వందనాలు.. నేను పడిన కష్టం జీవితంలో ఏ అమ్మాయి పడకూడదు. రెండుసార్లు ప్రెగ్నెన్సీ తీయించారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. చివరికి నన్ను ఇలా చేశారు. వారందరికీ ఉరి శిక్ష పడాలని కోరకుంటున్నా. ఆ ఏడుగురే నా చావుకు కారణం’’ అని సెల్ఫీ వీడియోలో యువతి వెల్లడించింది.
ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు ఆ యువతి ఎక్కడుందో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీడియోలో ఆమె చెప్పిన వారి వివరాలను ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. సెల్ఫీ వీడియో చూసిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కూతుర్ని ఎలాగైనా రక్షించమని పోలీసులను వేడుకుంటున్నారు.