మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.పురుషుల కన్నా ఎక్కువగానే అనేక రంగాల్లో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రంగంలోనూ వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అవును.. సరిగ్గా ఇదే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంది కనుకనే ఆ యువతి కూడా కష్టపడి చదివి పైలట్ అయింది. అంతే కాదు ఆమె దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా కూడా పేరు గాంచింది. ఆమే.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అయేషా అజీజ్.
అయేషా అజీజ్ వయస్సు 25 ఏళ్లు. దేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా గుర్తింపు పొందింది. ఈమె 2011లో పైలెట్ లైసెన్స్ పొందింది. అప్పుడామె వయస్సు 15 ఏళ్లు. దీంతో అప్పట్లోనే ఆమె అత్యంత పిన్న వయస్సులోనే పైలెట్ లైసెన్స్ పొందిన విద్యార్థినిగా గుర్తింపు పొందింది. అప్పట్లో ఆమె రష్యాలోని సొకోల్ ఎయిర్‌బేస్లో మిగ్-29 విమానాలను నడపడంలో శిక్షణ పొందింది.
అయేషా 2017లో బాంబే ఫ్లయింగ్ క్లబ్ (బీఎఫ్‌సీ) నుంచి కమర్షియల్ లైసెన్స్ పొందింది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు చెందిన మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వారు విద్యారంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. కాశ్మీరీ మహిళలు పీజీ, డాక్టరేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నేను కూడా పైలట్ అయ్యా. ఈ జాబ్‌లో అనేక సవాళ్లు ఉంటాయి. ఇది సాధారణ 9-5 జాబ్ కాదు. నిత్యం నిరంతరాయంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త వారిని కలవాలి. భిన్న వాతావరణ పరిస్థితుల్లో గడపాలి. అందువల్ల పైలట్ జాబ్ చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ ఇందులో రాణిస్తానని నమ్మకం ఉంది. అందుకనే పైలట్ అయ్యా. పైలట్ గా రాణించడం అంటే మాటలు కాదు, 200 మంది ప్రయాణికుల ప్రాణాలు పైలట్ చేతుల్లో ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతగా ప్రవర్తించాలి.. అని ఆమె అన్నది.
నాకు ఆద్యంతం నా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అందుకనే నేడు నేను ఈ ఘనతను సాధించా. నా తండ్రి నాకు గ్రేటెస్ట్ రోల్ మోడల్.. అని అయేషా పేర్కొంది.