జీతాలు రావడం లేదంటూ ప్రశ్నించిన ఓ వ్యక్తిపై బీజేపీ మంత్రి ఫైర్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తే నడుం విరుగుతుందని ఆ వ్యక్తిని మంత్రి హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని గోల్ఖెడా ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి మంత్రి విజయ్ షా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి పైకి లేచాడు. అంగన్ వాడీలో తన భార్య పని చేస్తోందని, ఆరు నెలలుగా ఆమెకు జీతం రావడం లేదన్నారు.
దీంతో అసహనానికి గురైన మంత్రి విజయ్ షా ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి శకానికి తాము నాంది పలుకుతున్నామన్నారు. సభలో ఎవరైనా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అది ప్రభుత్వ సమావేశమన్నారు. దీనికి అంతరాయం కలిగించే వారి నడుం పోలీసులు విరగ్గొడతారని ఆయన హెచ్చరించారు. సభకు అంతరాయం కలిగించేందుకు ఆ వ్యక్తికి కాంగ్రెస్ మద్యం తాగించి పంపించిందని ఆయన ఆరోపించారు. మంత్రి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.