గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయంలో ఎన్నికల అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం ఓటు హక్కు కూడా లేని చిన్న పిల్లలను తీసుకొచ్చి.. పెద్ద ఆఫీసర్లు కూర్చోవాల్సిన సీట్లలో కూర్చొబెట్టి… గ్రేటర్ ఎన్నికలని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారో ప్రత్యక్షగా చూపించారు.
పోలింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టేందుకు అవసరమైన వయస్సు కూడా లేని 17 ఏళ్ల బాలుడికి ఏకంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు. ఐఎస్ సదన్ డివిజన్‌లోని సింగరేణి కాలనీకి సంబంధించిన 24వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈ నిర్వాకం వెలుగు చూసింది.
పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన ఓ పార్టీ నాయకులు.. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సీట్లో కూర్చున్న బాలుడిని చూసి అవాక్కయ్యారు. బాలుడి వయస్సు అడగ్గా.. 17 ఏళ్లు అంటూ చెప్పాడు. పేరు అడగ్గా వరుణ్ అంటూ తెలిపాడు. దీంతో ఆ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
నిబంధనల ప్రకారమైతే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి. వారు అందుబాటులో లేకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకైనా బాధ్యత అప్పగించాలి. కానీ ఎన్నికలకు కూడా చిన్నపిల్లల ఆటగా భావించి.. అత్యంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు అధికారులు.