మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. యూత్ కాంగ్రెస్ నేతలు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. హరీష్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కు వెళ్తుండగా ఇది జరిగింది.
మంత్రి కాన్వాయ్ బర్కత్ పుర సిగ్నల్ దగ్గరకు రాగానే యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అడ్డుపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. హరీష్ కాన్వాయ్ కి అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ నేతలు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మంత్రులెవరినీ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ఇటు.. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని.. త్వరలోనే ఆ ప్రక్రియ చేపడతామని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఫీవర్ హాస్పిటల్ లో కొత్త ఓపీడీ బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. 13 హెర్సీ వెహికల్స్, 3 అంబులెన్సులను ప్రారంభించారు. హాస్పిటల్ కు పేషెంట్ల సంఖ్య పెరగుతుందని.. అందుకే కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణం చేపట్టామని వివరించారు.