ఇంటిముందు గొడవ చేయొద్దన్న పాపానికి ఓ కుటుంబంపై దాడి చేశారు ఎదురింట్లో ఉండే యువకులు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిందీ ఘటన. తర్వాత ఇరు వర్గాలు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించగా.. 16 మందిపై కేసు నమోదైంది.
బార్కాస్ ప్రాంతంలో సల్మాన్ అనే వ్యక్తి ఇంటి ముందు న్యూసెన్స్ చేశారు ఇరుగుపొరుగు యువకులు. చాలాసేపు ఓపిక పట్టిన అతను.. వారందరినీ వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన సయ్యద్ తారీఖ్ అనే వ్యక్తి.. అతని బంధువులు వెళ్లిపొమ్మనడానికి నువ్వెవరు అంటూ గొడవకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీళ్ల గొడవ కొనసాగుతుండగానే.. జిలానీ అండ్ గ్యాంగ్ కత్తులు, కర్రలతో ఎంట్రీ ఇచ్చింది. దాడికి పాల్పడింది. భయంతో ఇంట్లోకి పరుగులు పెట్టింది బాధత కుటుంబం.
కర్రలతో ఇంటి గేటును చాలాసేపు కొడుతూనే ఉంది జిలానీ గ్యాంగ్. చివరకు రెండు గ్రూపులు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు వాటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.