అతివేగం, పోలీసులపై భయం.. ఓ యువకుడి ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీని తప్పించుకునే క్రమంలో బైక్‌పై వెళ్తున్న యువకులు దండకర్రను ఢీకొట్టారు. ఈక్రమంలో బైక్ నడుపుతున్న యువకుడు తల వంచడంతో ప్రమాదం నుంచి బయటపడగా.. వెనక కూర్చున్న మరో యువకుడికి గేట్ ఇనుము కడ్డి బలంగా తాకింది. దీంతో అంతే బలంగా గాల్లో ఎగిరిపోయి దాదాపు 10 మీటర్ల దూరంలో పడ్డాడు. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంత జరుగుతున్నా బైక్‌పై నడుపుతున్న యువకుడు వెనక ఏమైందని చూసుకోలేదు. అదే వేగంతో ముందుకు దూసుకెళ్లాడు.
ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూస్తే మధ్యాహ్నం 12.53 గంటల సమయాన్ని చూపిస్తోంది. అంటే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఆ భయంతోనే యువకులు తప్పించుకునే క్రమంలో ప్రమాదానికి గురైనట్టుగా అర్థమవుతోంది. అయితే అప్పటికీ పోలీసులు బైక్‌ను ఆపాలని, చేతితో సైగ చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లారు. ఇదిలా ఉంటే పోలీసులు హఠాత్తుగా గేట్‌ను దించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.