ప్రపంచవ్యాప్తంగా ఏటా భూతాపం పెరిగిపోతోంది. పర్యావరణం నాశనమవుతోంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. దీంతో అన్ని దేశాల్లోనూ ఆయా ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. అయితే పాకిస్థాన్‌లోనూ అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అలా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఆ కార్యక్రమంలో భాగంగా ఒక చోట నాటిన మొక్కలను కొందరు పూర్తిగా ధ్వంసం చేశారు. మొక్కలను ఊడబీకారు. ఈ సంఘటన అక్కడ సంచలనం రేపుతోంది.
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఒక్క రోజులోనే మొత్తం 3.5 మిలియన్ల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని.. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. అయితే.. అక్కడి ఖైబర్ మండీ కాస్ అనే జిల్లాలో ఓ చోట కొందరు ఆ కార్యక్రమంలో భాగంగా నాటిన సుమారు 6వేల మొక్కలను ధ్వంసం చేశారు. మొక్కలను ఎక్కడికక్కడే వేళ్లతో సహా ఊడబీకారు. ఆ సమయంలో తీసిన వీడియో కాస్తా వైరల్ అయింది.
Prime minister Imran Khan of Pakistan🇵🇰 this weekend organized massive treplanting. Extremists attacked the great efforts of the prime minister claiming it is against islam. Crazy! All religions call upon us to protect Mother Earth.
— Erik Solheim (@ErikSolheim) August 10, 2020
అయితే ఆ రాష్ట్ర సీఎం మహమూద్ ఖాన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ ఘటనకు పాల్పడి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.సదరు మొక్కలు నాటినది వివాదాస్పద స్థలం అని.. అది కోర్టు కేసులో ఉందని.. అందుకనే కొందరు వచ్చి ఆ మొక్కలను తొలగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ వారు అలా మొక్కలను తీసేస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది.