అభివృద్ధి చెందిన భారత్‌లో యువతే అత్యధిక లబ్ధి పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. దాన్ని నిర్మించే అతిపెద్ద బాధ్యత యువత భుజాలపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోయే ఎన్‌సీసీ క్యాడెట్స్ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ ‘అమృత్ కాల్’లో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి పర్యావరణం వరకు అన్ని రంగాల్లో ప్రపంచ భవిష్యత్ కోసం భారత్ కృషి చేస్తున్నందున దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.
యువత పెద్దఎత్తున వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటివి యువ తరాలను జాతీయ లక్ష్యాలతో అనుసంధానం చేస్తున్నాయని చెప్పారు. వారి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అభివృద్ధిని పెంచి, అనేక సౌకర్యాలను కల్పించడం ద్వారా సరిహద్దు ప్రాంతాలను ఉత్సాహభరితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతకు సాధికారత కల్పించడంతోపాటు విద్య, ఉపాధికి మెరుగైన మార్గాలను సృష్టించడం ద్వారా ఈ గ్రామాలకు ప్రజలు తిరిగి వచ్చేలా చూడాలని ఆలోచన తమ ప్రభుత్వానికి వుందన్నారు.