మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం తెలంగాణ హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అతని అల్లుడు, వివేకా రెండో భార్య పాత్రపై దర్యాప్తు చేయడం లేదని అవినాష్ ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివేకా కూతురు సునీత ఇంప్లీడ్ పిటిషన్ వెనుక సీబీఐ హస్తముందని పేర్కొన్నారు.
వివేకాది గుండెపోటు అని తాను ఎక్కడా చెప్పలేదని అఫిడవిట్ లో తెలిపారు. శశికళ అనే మహిళతో అసలు తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. మార్చి 10న జరిగిన విచారణలో తన గుగుల్ టేక్ ఔట్ డేటాను విచారణలో సీబీఐ అడిగిందన్నారు. పారదర్శకంగా విచారణ జరిపితే ఇవ్వడానికి తాను సిద్ధమని అవినాష్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణ పారదర్శకంగా సాగడం లేదని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనను లక్ష్యంగా చేసుకొని సీబీఐ విచారణ సాగుతుందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 9వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు తదుపరి తుది తీర్పు వెల్లడయ్యేవరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు సూచించింది.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోరారు. అందుకు సీబీఐకి లేఖ పెట్టుకోవాలని హైకోర్టు చెప్పింది. అంతకుముందు సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.