మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ హత్య కేసులో భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం ఆయనకు బీపీ లెవల్స్ పెరగడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. అవసరమైతే నిమ్స్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు 5 గంటల పాటు వాదనలు వినిపించారు.
ఆ తర్వాత సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో శనివారం ఉదయానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా.. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్ తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్రీలక్ష్మిని విశ్వభారతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అనంతరం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.