ఏమిస్తే.. మళ్లీ అధికారంలోకి రాగలమనేదానిపై క్లారిటీ ఉంది. ఎంత ఇవ్వాలో కూడా లెక్కలున్నాయి. కాని అంత ఎలా తెచ్చుకోవాలనేదే ఆయనకు అర్ధం కావటం లేదు. సంపాదించటం తెలియటం లేదు.. కాని ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రణాళికలు భారీగానే రచించారు. క్యాలెండర్ కూడా తయారు చేసి.. డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లు అవ్వాలంటే మాత్రం డబ్బులు భారీగా కావాలి. రోజురోజుకు పడిపోతున్న ఆదాయం.. కరిగిపోతున్న కరెన్సీ.. ఇవన్నీ కలవరపెడుతుంటే.. సగటు మధ్యతరగతి మనిషిలా.. ప్రభుత్వాధినేత ఆస్తులు అమ్మాలని నిర్ణయించారు. దానికో పేరు కూడా పెట్టారు. అదే మిషన్ బిల్డ్ ఏపీ.
మిషన్ బిల్ట్ ఏపీ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే.. అమ్మకాలు చేయాలని… ప్రభుత్వ భూములు అమ్మేయాలనేదే దాని సారాంశం. జగన్ నవరత్నాలు అమలు చేసి.. తాననుకున్న వర్గాలకు ఎంతోకొంత అందించి.. వారిని తన ఓటర్లుగా కన్సాలిడేట్ చేసుకోవాలనే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. అందుకే ముందు నుంచి వాటిపైనే కేంద్రీకరణ చేస్తున్నారు. అది కరెక్ట్ గా చేస్తే.. తనకు తిరుగుండదని.. మళ్లీ గెలిచేది కూడా వైసీపీయేనని ఆయన విశ్వాసంగా కనపడుతోంది. కాని అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అన్ని నిధులు ఎలా సమకూర్చాలనేది పెద్ద బ్రహ్మపదార్ధంగా ఆయనకు కనపడుతోంది. ఈ విషయంలో చంద్రబాబే బెటరని మేధావులు సైతం భావిస్తున్నారు. రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. ఫక్తు రియల్ ఎస్టేట్ స్కెచ్ తో కట్టేయడానికి బాబు వేసిన ప్లాన్ ఇందుకు ఉదాహరణగా వారు చూపిస్తున్నారు.
అసలు చంద్రబాబు మళ్లీ వచ్చుంటే.. అన్ని పథకాలతో పాటు.. రుణమాఫీ బ్యాలెన్స్ కూడ చెల్లించేవారని.. ఎందుకంటే అప్పు పుట్టించేలా ప్రజంటేషన్ ఇవ్వగల సామర్ధ్యం ఆయనకే ఉందని టీడీపీవారు చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పే లెక్కలు, విజన్ వింటే ఏ బ్యాంకు అయినా డబ్బులు ఇవ్వడానికి ముందుకొస్తుందని.. ఆ సాఫ్ట్ వేర్ జగన్ కు లేదని వారంటున్నారు. అసలు ఎన్నికలకు ముందు డబ్బులు లేకపోయినా.. అన్నీ చెల్లించేయడానికి చంద్రబాబు సిద్ధపడిపోయారు. కాని ఎన్నికల కమిషన్ ను ఉపయోగించి వైసీపీ మోకాలడ్డటంతో.. కొన్ని ఆగిపోయాయి. ఆ సమయంలో చంద్రబాబు చేసిన మనీ మేనేజ్ మెంట్ వివరాలు తెలుసుకుని జగన్ సైతం ఆశ్చర్యపోయారని అధికారవర్గాల్లో వినపడుతోంది.
రాజధాని అమరావతి కాన్సెప్ట్ అనేదే లేకుండా చేయటంలో దాదాపు జగన్ సక్సెస్ అయినట్లే. బొత్సను ముందు పెట్టి.. రకరకాల స్టేట్ మెంట్లతో.. అవసరమైనదంతా చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుంది. ఇక ఇసుక సంక్షోభంతో రాష్ట్రమంతా రియల్ ఎస్టేట్ దెబ్బ తింది. దాంతో రెగ్యులర్ గా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. ఒకవైపు వ్యాపారాలు దెబ్బ తినటం.. మరోవైపు ఆర్ధిక మాంద్యం ప్రభావంతో.. పన్నుల వసూళ్లు కూడా తగ్గిపోయాయి. దీంతో డబ్బుల కోసం ప్రభుత్వ భూములు అమ్ముదామనే కాన్సెప్ట్ ను ముందుకు తెచ్చింది జగన్ ప్రభుత్వం.
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని ఆక్షన్ లో అమ్మేయాలనేది ప్లాన్. అయితే ఇక్కడ తిరకాసు ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ భూములు అమ్మాలో అధికారులకన్నా ముందే వైసీపీ నేతలు నిర్ణయిస్తారని.. వారికవసరమైనవన్నీ వారే కొనేసుకుంటారని.. ఇందులో మూడో వ్యక్తిని రానివ్వరని వారు ఆరోపిస్తున్నారు. కాస్ట్ లీ భూములను కారుచౌకగా కొట్టేయడానికే వైసీపీ నేతలు పథకం వేశారని వారంటున్నారు. ఇది మరో క్విడ్ ప్రోకో అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఏయే భూములు అమ్మాలో జిల్లాలవారీగా లిస్టులు రెడీ చేశారంటున్నారు.