ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజా ఆందోళనలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. 13రోజులుగా రాజధాని అమరావతి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో 13 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం నుంచి మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల్లో వంటా-వార్పు…కృష్ణాయపాలెం, నవులూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడలో సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు న్యాయవాదులు బైక్ ర్యాలీ తీయనున్నారు. ప్రజల ఆందోళనకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయి.
మరో వైపు తాజాగా అమరావతి రాజధానిపై 10 మంది మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి జీఎన్ రావు ఇచ్చిన నివేదిక, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సిఫార్సులను పరిశీలించి ఈ హై పవర్ కమిటీ సిఫార్సులు చేయనుంది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. హైపవర్ కమిటీ తమ పరిశీలనలో భాగంగా అడ్వకేట్ జనరల్ సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ఈ హైపవర్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, హోం మంత్రి సుచరిత, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య,పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణ శాఖ మంత్రి పేర్ని నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, డీజీపీ గౌతం సవాంగ్, సీసీఎల్ ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సభ్య కన్వీనర్ గా వ్యవహరిస్తారు.