సయ్యద్ రఫీ, రాజకీయ విశ్లేషకుడు
జగన్ 100 రోజుల పాలన ‘బాహుబలి’ అనుకుంటే ‘సాహో’ అయ్యింది. జగన్‌రెడ్డి తాను ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకుంటానని, వైఎస్సార్ కంటే మంచి పాలన ఇస్తానని స్వయంగా ప్రకటించుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, బీజేపీ కూడా కొత్త ప్రభుత్యానికి ఒక సంవత్సరం సమయం ఇవ్వాలనే అనుకున్నాయి. జగన్‌రెడ్డి నవరత్నాల అమలుకే ఈ వంద రోజుల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు ఒక క్యాలెండర్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అది అక్టోబర్ నుంచి వరుసగా అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని మీద రాష్ట్రంలో అనేక వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి.
రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే సరిపోతుందని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. ఇవి కాకుండా కూడా జగన్ తాను పాదయాత్రలో పలు వర్గాలకు, సంస్థలకు ఇచ్చిన హామీలు అనేకం ఉన్నాయి. వాటి అమల్లో కూడ ఆ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. వాటి అమల్లో ఎంతవరకు ప్రభుత్వం ముందుకు వెళుతుంతో చూడాలి. ఉదాహరణకు నూతన పెన్షన్ సమస్య. ఇది కేంద్ర ప్రభుత్వ పాలసీ. దీన్ని వైఎస్సార్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఎలా జగన్ ప్రభుత్వం ఎలా మారుస్తుందో చూడాలి. ఇలా అనేకం ఉన్నాయి. లాయర్లకు నెల వారీ 3వేల రూపాయలు ఇస్తామని జగన్ చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పాదయాత్రలో చెప్పారు. ఇవేకాక ఎక్కడికక్కడ అనేక హామీలు కురిపించారు. ఇవన్నీ వెంటనే కాకపోయినా తన పదవీ కాలంలో పూర్తయ్యేలోపునైనా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. అధికారంలోకి వచ్చి చేసిన తొలి నిర్ణయాల్లో ఆశా వర్కర్ల జీతాలు 10 వేలు చేయడం ఒకటి. అందులో పెట్టిన గ్రేడింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. శాపనార్థాలు పెట్టారు. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ నిబంధనలు సవరించవలసి వచ్చింది. తిరిగి క్యాబినెట్ 10 వేలు జీతం ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఎందుకు కోట్ చేశానంటే ప్రభుత్వ నిర్ణయాలు అమల్లో ఎంత లోపాలు ఉన్నాయో తెలియటానికి. ఇక ఇసుక మీద విధానాన్ని తెస్తామని చేసిన కాలయాపనతో 20 లక్షల మంది భవన కార్మికులు ఆకలితో అల్లాడుతుంటే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తీవ్ర విమర్శలకు గురి అయ్యింది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి తగ్గించుకున్నాయి. లారీలు, ట్రాక్టర్లకు అద్దెలు లేక సిబ్బంది యజమానులు నష్టపోయారు. అన్నక్యాంటీన్లు ఎత్తివేయటం, చంద్రన్న బీమా ఆపటం, రంజాన్ తోఫా ఎగవేత, నిరుద్యోగ భృతి ఆపటం లాంటి అనేక అంశాలు తిరోగమన చర్యలుగా ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. ఇక ‘మీసేవ’ను రద్దు చేస్తామని చెపుతున్నారు. అందులో 50 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. మా పరిస్థితి ఏంటి అని ఆందోళనలో ఉన్నారు గోపాలమిత్ర సిబ్బంది నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో గాని దాని వల్ల షాపుల్లో, బార్లలో పని చేసే వారు షుమారు 50 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వారికి ప్రభుత్వ మద్యం షాపుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తే బాగుండేది. ప్రభుత్వం కొత్తగా ఉద్యగులను పెట్టుకుంటామని ప్రకటించింది. ఎంతో ఆర్భాటంగా నియమించిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం 5 రూపాయలు, దానికి ఇచ్చే సంచి 9 రూపాయలా అని ప్రశ్నిస్తున్నారు. నియామకాలు అందుకున్న చాలా మంది విధుల్లోకి చేరటానికి అప్ప్పుడే నిరాకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక గ్రామ సచివాలయం కోసం పరీక్షలకు లక్షల మంది హాజరయ్యారు.వారు నియామకాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది ఏం విధులు నిర్వహిస్తారో స్పష్టత లేదు. ఇలా అనేక అంశాలు వివాదాస్పదమైనవి ఉన్నాయి. ఇక చంద్రబాబు ఆడిగాడని మాత్రమే ప్రజావేదిక కూల్చారనే అప్రదిష్ట మూటకట్టుకుంది జగన్ ప్రభుత్వం. ఎందుకంటే కలెక్టర్ల సమావేశంలో అన్ని జిల్లాలోని నది పరివాహక ప్రాంతాలాల్లో అన్ని అక్రమ కట్టడాలను కూల్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా అవి అమలు చేయలేదు. కేవలం చంద్రబాబు నివాసాన్ని కూల్చటానికే ప్రభుత్వం కట్టుబడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి ఆపడం, పోలవరం ఆపడం, రివర్స్ టెండర్లు, విద్యుత్ సంస్థల సమీక్షలపై ప్రభుత్వ నిర్ణయాలు, హైకోర్టు స్టే కేంద్రం నుంచి వ్యతిరేకత ఇవ్వన్ని వివాదాస్పదమయిన తీరు రోజు ప్రజల్లో, మీడియాలలో చర్చ జరుగుతుంది. వేటన్నికి చంద్రబాబు పై కక్ష సాధింపుతోనే అనేది ప్రజల్లో బలంగా వినిపిస్తుoది.అప్పుడే రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. పాదయాత్రలో 6 లక్షల కోట్లు చంద్రబాబు అవినీతి చేసారని ప్రతిచోటా ఆరోపించిన జగన్‌పై దాన్ని రుజువు చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ప్రజలు దాన్ని గమనిస్తారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుకు జగన్ ఎలా సాధిస్తారో చూడాలి. ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు ఇవ్వన్నీ ఆందోళనలు కల్గించే అంశాలు. 6 నెలలో మంచి ముఖ్యమంత్రి మాట అటుంచితే 100 రోజులకే ప్రతిఘటన ఎదుర్కొవలసిన పరిస్థితి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంపై అనేక గురుతర బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర సహాయం ఉండదనే సూచికలు కనిపిస్తున్నాయి, పైపెచ్చు రాష్ట్ర బీజేపీ అప్పుడే విమర్శలు సంధిస్తోంది. ఎంతో ఆశతో ‘బాహుబలి’లా జగన్ పాలన ఉంటుందను కుంటే అది’ సాహో’ మాదిరిగా ఉందనిపిస్తోంది.