గుంటూరు: ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారందరూ ఇప్పుడు సైలెంటైపోయారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ కూడా ఇప్పుడు నోరు మెదపటంలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం ఉందని అందరూ భావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు రాజ్యసభలో గట్టిగా వాదించిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ కేంద్ర మంత్రివర్గంలో మంత్రులైనా కానీ, హోదా మాత్రం రాలేదు. తర్వాత హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజీతో సరిపెట్టారు. అదంతా గతం.
మొన్నటి ఎన్నికల ముందు తమను గెలిపిస్తే కేంద్రంతో పోరాడి తప్పకుండా ప్రత్యేకహోదా సాధించి తీరుతామని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఆ టాపిక్కే ఎత్తడం లేదు. కేంద్రంలో బీజేపీకీ పూర్తి బలం రావడంతో ఇప్పుడు మన అవసరమే లేదని, అందువల్ల ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అడగడమే తప్ప ఏమీ చేయలేమని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముందే క్లారిటీ ఇచ్చి కళ్లు తెరిపించారు.
జనసేన సహా ఎవరికీ ఎక్కడా పోరాట పటిమ లేదు. అందరూ చప్పబడిపోయారు. టీడీపీ మరీ దారుణం. ఈ విషయం గురించి ఆ పార్టీలో నోరు మెదపటమే లేదు. జగన్ పార్టీని కార్నర్ చేయడానికి వారికి వున్న అనేక అస్త్రాల్లో ప్రత్యేక హోదా ప్రముఖమైనది. కానీ, వాళ్లు దాన్ని వాడుకుంటున్నట్టే కనిపించడం లేదు. సుజనా చౌదరి చెప్పినట్టు అందరూ ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమే అని భావిస్తున్నారు.
ఈ అంశంపై ఎవరూ మాట్లాడకుండా నరేంద్ర మోడీ పన్నిన వ్యూహాల్లో అందరూ చిక్కుకున్నారు. ఎవరి భయాలు వారికి ఉన్నాయ్. ఎవరి ప్రయోజనాలు వారికి అవసరం. ఇవన్నీఇక ఎప్పటికీ ఇలానే వుంటాయ్. కనుకనే కేంద్రంలో మోడీ చక్రం తిప్పుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. టోటల్‌గా టీడీపీ, వైసీపీ ఇతర పార్టీల వారంతా కలిసి ‘ప్రత్యేక హోదా’ని డస్ట్‌బిన్‌లో పడేసి పాలిటిక్స్ నడుపుతున్నారు. ఈ నేఫథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ సహా అందరూ కలిసి చివరికి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.