‘‘వైఎస్ విగ్రహం ఉంటది కదా.. అక్కడ లెఫ్ట్ తీసుకుని వచ్చేయ్..’’ అంటే.. ‘‘ఏ వైఎస్ విగ్రహం రోడ్ ఎంట్రెన్స్ లో ఉండేదా.. లేక తర్వాత వచ్చేదా‘‘ అని ప్రశ్న వచ్చింది. అదీ పరిస్ధితి. సందు సందుకు వైఎస్ విగ్రహాలు పెట్టేశారు. పరిపాలనలో తనదైన సంక్షేమం మార్క్ చూపించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి మార్కులే కొట్టేశారు.. దాని వెనుకే రిమార్కులు కూడా ఉన్నాయి. అయినా మాస్ లీడరే. అందుకే ఆయన చనిపోగానే.. చాలామంది బాధపడ్డారు.
టార్గెట్ మీద క్లారిటీ ఉన్న ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వాడవాడలా వైఎస్ ఆర్ విగ్రహాలు పెట్టించడంపై చాలా శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు పదేళ్లపాటు.. తన ప్రసంగాల్లోనూ, తన చానెల్ మీద వైఎస్ కనపడ్డారంటే.. ఎంతలా వాడకం నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ కు వచ్చిన ఇమేజ్ అంతా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా వచ్చిందే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విగ్రహాల వ్యూహం ఇంకా ఆగిపోలేదు. ఇప్పుడు అధికారం వచ్చాక కూడా.. దానిని కొనసాగించే పనిలో ఉన్నారు. వారికెలాగూ ఎవరు ఒప్పుకుంటారు.. ఎవరు ఒప్పుకోరు అనేదానితో పని లేదు.
ఇప్పుడు విగ్రహాలు పెట్టేది యూనివర్శిటీల్లో. అవును మీరు చదివింది కరెక్టే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతి యూనివర్శిటీలో పెట్టే పనిలో పడింది జగన్ ప్రభుత్వం. విద్యార్ధి దశ నుంచే తమ పార్టీకి కార్యకర్తలను సమకూర్చుకోవడానికి ఇది మంచి మార్గమని భావించినట్లుంది. మొదటి విగ్రహం నాగార్జున యూనివర్శిటీలో పెట్టబోతున్నారు. అన్ని నిర్ణయాలు అయిపోయాయి. పెట్టడం ఇక లాంఛనమే.
నాగార్జున యూనివర్శిటీ వీసీ వినిపిస్తున్న వివరణ వింటే మనకు మతి పోవాల్సిందే. 2009లో వైఎస్ మరణించకముందే.. ఇంజనీరింగ్ కాలేజికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చింది వైఎస్ కాబట్టి.. ఆయన విగ్రహం పెట్టాలని అప్పుడే తీర్మానం చేశారంట. ఇప్పుడా తీర్మానం అమలు చేస్తున్నాం అంతే.. అంటున్నారు. ముందు నాగార్జున యూనివర్శిటీలో విగ్రహావిష్కరణ అట్టహాసంగా చేశాక.. అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ప్రకటిస్తారు.. ‘‘ప్రతి యూనివర్శిటీలోనూ మన ప్రియతమ నేత విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది‘‘ అని.
జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలు వీరందరినీ వదిలిపెట్టి.. ప్రతి యూనివర్శిటీలోనూ విగ్రహం పెట్టేంత మహానుభావుడు అయితే కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుల్లో ఎన్టీఆర్ తర్వాత మాస్ నాయకుడిగా ముద్ర పడిన నాయకుడు..అందులో సందేహం లేదు. కాని లీడర్ గా ఎదగటం వేరు.. విలువలను భావితరాలకు అందించడం వేరు.
ప్రత్యర్ధుల మాటల్లోనే చెప్పాలంటే ‘‘వైఎస్ ప్రజలకు మంచి చేయాలనే చూశారు. అదే సమయంలో అందులో తమ మంచి కూడా చూసుకున్నారు. ప్రతి పథకం వెనక ఆదాయం చూసుకున్నారు. ప్రతి పరిశ్రమ ఏర్పాటు వెనక భూపందేరం.. కిక్ బ్యాక్ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆయనను నమ్ముకున్నఎవరినీ ఆయన నిరాశపర్చరు.. క్రిమినల్స్ తో సహా. అదీ ఆయన ధోరణి‘‘ అంటారు. మరి అలాంటి నేత విగ్రహం ప్రతి విద్యార్ధి ముందు ప్రదర్శించడం అవసరమా అనేది మేధావుల ప్రశ్న.
ఏమైనా.. దీనిపై జగన్ ముందుకే వెళతారు.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి.. వాదోపవాదాలు నడుస్తాయి.. కనీసం ఒక నెలపాటు మీడియాకు మేత దొరుకుతుంది.. ప్రజలకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది.