విజయవాడ: ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేపకపోతే నేతలకు పొద్దు గడవదు. ఎప్పుడో సమసిందనుకునే విగ్రహాల రచ్చ బెజవాడలో మళ్లీ మొదలయ్యింది. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మళ్లీ నిలబెడుతున్నారు. విజయవాడ రాజధాని హోదాకు ఎదిగిన తరువాత హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో జనం ఇటు షిఫ్ట్ కావడంతో పెరిగిన వాహనాల రాకపోకల దృష్ట్యా నగర నడిబొడ్డున విగ్రహం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి గత టీడీపీ హయాంలో ఇక్కడి నుంచి దీన్ని తొలగించారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతోనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మళ్లీ ఈ విగ్రహం దుమ్ము దులిపారు. ఎక్కడైతే పాత విగ్రహాన్ని కూలగొట్టారో అదే ప్రదేశంలో మళ్లీ కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించారు. దీన్ని వైసీపీ అధినేత జగన్ ఆవిష్కరించనున్నారని మల్లాది ఒక ప్రకటన చేశారు. ప్రజల హృదయాలలో కొలువైవున్న వైయస్ విగ్రహాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసూయ ద్వేషాలతో తొలగించారని విమర్శించారు. ఆనాడు తొలగించిన మహానేత విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ పునః ప్రతిష్టిస్తున్నారని చెప్పారు. వైఎస్ విగ్రహ పున:ప్రతిష్టపై తెలుగుదేశం పార్టీ వర్గాలేవీ ఇంతవరకు అయితే నోరు మెదప లేదు.