బోడుప్పల్ పీర్జాదిగూడలో వైటీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను దీక్ష చేసి తీరతానని షర్మిల తేల్చి చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు కుదరదని చెప్పడం సరికాదన్నారు షర్మిల. అంతకుముందు దీక్షాశిబిరం దగ్గర మట్లాడిన ఆమె టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేశారు.
ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోయారని ఆరోపించారు షర్మిల. సీఎం వందల మంది నిరుద్యోగుల ప్రాణాలు బలిగొన్న హంతకుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఏడేళ్లుగా నిద్రపోయిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు గర్జనలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయని విమర్శించారు.
నిజంగా కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తే ఇన్ని నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగేవా..? అని నిలదీశారు షర్మిల. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి కనీసం చూడడానికి కూడా వెళ్లలేదని మండిపడ్డారు.