రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత మర్చిపోవటంతోనే పార్టీ పెట్టినట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామంలో రైతు గోస కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు వైఎస్ షర్మిల. భూముల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్కు లేదని విమర్శించారు.
రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లైనా రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కోటీశ్వరులైతే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రుణమాఫీ అని చెప్పి ఎంత మందికి రుణాలు మాఫీ చేశారని నిలదీశారు. కేసీఆర్ రుణాలు మాఫీ చేస్తే కదా.. బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చేదంటూ ఎద్దేవా చేశారు.
అలాగే ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తామని 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, పంటలు ఎండుతుంటే.. భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ వరి రైతులను నిండా మోసం చేశారని షర్మిల ఆరోపించారు. తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారని విమర్శించారు. కేసీఆర్ తప్పు చేస్తే ఇప్పుడు రైతులకు శిక్ష పడిందని ఆరోపించారు.
17 లక్షల ఎకరాల్లో వరి వేయని రైతుకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 35 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని సైతం కొనడం లేదని షర్మిల ఆరోపించారు. 8 వేల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి వెయ్యి కూడా తెరవలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతులను ఏ రకంగా ఆదుకున్నారో ఒక్కటి చూపించాలని డిమాండ్ చేశారు.