హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడో గానీ.. రోజురోజుకీ అక్కడి పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది పోటీకి సిద్ధమని ప్రకటించారు. 500 మంది వైశ్యులు అలాగే 120 మంది మిడ్ మానేరు నిర్వాసితులు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సర్వేలన్నీ ఈటలవైపు ఉన్నాయి. దళిత బంధుతో లబ్ధి పొందుదామని భావించిన టీఆర్ఎస్.. అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం లేదని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు వందల సంఖ్యలో నామినేషన్లు వేసి.. కేసీఆర్ మెడలు వంచాలని అన్నారు షర్మిల. సీఎంకు గుణపాఠం చెప్పాలంటే ఇదే సరైన నిర్ణయమని ట్వీట్ చేశారు. ఇకపై నిరుద్యోగుల తరఫున పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసే వరకూ తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో నిరుద్యోగులు చనిపోతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. నోటిఫికేషన్లు రేపు, మాపు అంటూ ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. యువతకు వయసు అయిపోతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారామె.