మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై వైటీపీ అధినేత్రి షర్మిల విరుచుకుపడ్డారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఖమ్మం పట్టణం యువకుడు పువ్వాడ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఇలాంటి చాలా విషయాలు ఏవీ కూడా బయటకు రాకుండా కప్పిపుచ్చారని మండిపడ్డారు. ఇక్కడ అంతా ఒక నియంత పాలన కొనసాగుతోందన్నారు.
అసలు మంత్రి పదవికి ఉండాల్సిన విలువ, హోదా, హుందా ఏదీ కూడా పువ్వాడకు తెలియదంటూ విమర్శించారు షర్మిల. ఎన్ని ఆస్తులు సంపాదించినా.. ఎన్ని కబ్జాలు చేసినా ఆయన ధనదాహం మాత్రం తీరదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేశారని… కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడకు సరిపోతుందని ఎద్దేవ చేశారు.
ఒకప్పుడు ఇల్లు కూడా లేని పువ్వాడకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల బతుకులను రోడ్ల పాలు చేశారని దుయ్యబట్టారు. కనీసం యూనియన్స్ లేకుండా చేశారని విమర్శలు చేశారు. ఈ దిక్కుమాలిన మంత్రి.. ఒక కంత్రి.. వైఎస్సాఆర్ విగ్రహాలను తీసేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
పోలీసులను పనోళ్లలా వాడుకోవడం మగతనం కాదు.. ఒక రౌడీ షీటర్ గా వ్యవహరించడం గొప్పతనం కాదు.. దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవితో మేలు చెయ్యి.. మీకు ఆ దమ్ము లేదు.. పని తనం లేదు అంటూ విమర్శలు గుప్పించారు షర్మిల. పువ్వాడ అజయ్ కున్న పేరు గూండా, రౌడీ షీటర్, దొంగ, ఒక బ్లాక్ మెయిలర్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.